ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

Khairatabad Ganesh Shobhayatra Started in Hyderabad.హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు పెద్ద ఎత్తున వినాయ‌క నిమ‌జ్జ‌నాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2021 4:24 AM GMT
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు పెద్ద ఎత్తున వినాయ‌క నిమ‌జ్జ‌నాలు జ‌ర‌గ‌నున్నాయి. తొమ్మిది రోజుల పాటు భ‌క్తుల పూజ‌లు అందుకున్న ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. గ‌ణేశుడిని ట్రాలిపైకి ఎక్కించిన నిర్వ‌హాకులు కార్య‌క్ర‌మాన్ని వైభ‌వంగా మొద‌లుపెట్టారు. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపైకి గణేశుడిని చేర్చిన నిర్వాహకులు తెల్లవారుజామునే అవసరమైన వెల్డింగ్ పనులను పూర్తిచేసి శోభాయాత్రకు సిద్ధం చేశారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపు ర‌థంపై మ‌హాగ‌ణ‌ప‌తి భ‌క్తుల‌కు ద‌ర్శ‌మినిస్తున్నారు.

మొత్తం 17 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జ‌ర‌నుంది. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైర‌తాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. శోభాయాత్ర కొన‌సాగే మార్గాల్లో ట్రాఫిక్‌ను మ‌ళ్లించారు. మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. నిమ‌జ్జ‌న ఉత్స‌వాల్లో భాగంగా జీహెచ్ఎంసీ భ‌క్తుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తోంది.

మ‌రోవైపు.. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు కూడా ఈ ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బాలాపూర్‌లోని ప్ర‌ధాన వీధుల్లో వినాయ‌కుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అనంత‌రం బాలాపూర్ చౌరస్తాలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు.

Next Story