హైదరాబాద్: ప్రముఖ సినీ నటీమణుల నకిలీ ఓటరు ఐడీ కార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మధుర నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సమంతా రూత్ ప్రభు, తమన్నా భాటియా పేర్లతో నకిలీ ఓటరు ఐడీలు, చెల్లని EPIC నంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు వ్యాప్తి చెందడాన్ని ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఐడీలను పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు సమాచారం, నకిలీ పత్రాలను ఆన్‌లైన్‌లో సృష్టించడం లేదా పంచుకోవడంలో పాల్గొన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, మధురానగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 336(4), 353(1)(C) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.