సీని న‌టుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సైబ‌రాబాద్ పోలీసుల‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో ఈ ప్రత్యేక కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించారు. దీనికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు. అలాగే అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడారు. సైబ‌రాబాద్ పోలీసుల సేవ‌ల‌ను కొనియాడారు. ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత విష‌యంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్నార‌ని మెచ్చుకున్నారు. డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల కృషి వ‌ల్ల‌ ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య‌లు.. రోడ్డు ప్ర‌మాదాల వంటివి గ‌త మూడేళ్లుగా త‌గ్గిపోయాయ‌న్నారు. హెల్మెట్ పెట్టుకోక‌పోయినా, మ‌ద్యం తాగినా సైబ‌రాబాద్ ప‌రిధిలోని రోడ్ల‌లోకి వెళ్ల‌కూడ‌ద‌ని వాహ‌న‌దారులు భావిస్తున్నార‌ని, అంత‌గా కృషి చేసి ట్రాఫిక్ పోలీసులు మంచి పేరు తెచ్చార‌ని సీపీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'నేను ఇక్క‌డికి ఓ సినీన‌టుడిగా రాలేదు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను. ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించ‌డం అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం' అని ఎన్టీఆర్ చెప్పారు. ఇంటి నుండి బయటికి వెళ్లే టప్పుడు మన కోసం ఎదురుచూసే ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ప్రమాదకరమైన కోవిడ్‌కి వ్యాక్సిన్ ఉంది కానీ, ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు వ్యాక్సిన్ లేదు. మీ కోసం మీ కుటుంబం కోసం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన దేశానికి పహారా కాస్తున్న సైనికుల, మన ఇంటి పక్కనే పహారా కాస్తున్న పోలీసుల సేవలు అందరూ గుర్తించాలి. మన తల్లిదండ్రులను ఏవిధంగా అయితే గౌరవిస్తామో అలాగే మన పోలీస్ డిపార్ట్ మెంట్‌ను కూడా ఓ పౌరుడుగా గుర్తించాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అన్నారు.తోట‌ వంశీ కుమార్‌

Next Story