Hyderabad: నీటి కలుషితంపై ఆందోళన.. నాణ్యత పరీక్షలు రెట్టింపు
కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదనీటి తొలగింపు, మురుగు జెట్టింగ్ మిషన్ల కార్యకలాపాలపై జలమండలి ఎండీ దానకిషోర్ రివ్యూ నిర్వహించారు.
By అంజి Published on 23 July 2023 3:08 AM GMTHyderabad: నీటి కలుషితంపై ఆందోళన.. నాణ్యత పరీక్షలు రెట్టింపు
హైదరాబాద్ : కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదనీటి తొలగింపు, మురుగు జెట్టింగ్ మిషన్ల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ సంబంధిత డిప్యూటీ జనరల్ మేనేజర్‌లను (డిజిఎంలు) కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మంచి నీరు కలుషితమయ్య అవకాశం ఎక్కువగా ఉంది. కలుషిత నీటి కారణంగా ప్రజలు వ్యాధులు బారిన పడే ఛాన్స్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి ఎండీ కీలక నిర్ణయం తీసుకున్నారు. నీటి సరఫరా భద్రత, పరిశుభ్రతను నిర్ధారించడానికి క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత సీజీఎంలను ఆదేశించారు.
ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు), జీఎంలు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు (డీజీఎంలు), ఇతర అధికారులతో దానకిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం శుక్రవారాల్లో నిర్వహిస్తున్న నీటి నాణ్యత పరీక్షలను ఫ్రీక్వెన్సీ పెంచాలని సమావేశంలో ఆయన ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై ఉన్న మ్యాన్‌హోల్స్ వద్ద మురుగునీరు పొంగిపొర్లుతున్నాయని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అదనంగా జీఎంలు నివాసాల వద్ద వరద నీటి సమస్యలను పరిష్కరించడానికి పరిష్కారాలను కనుగొనే పనిలో ఉన్నారు. లోతైన మ్యాన్‌హోల్స్, మురుగునీరు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కిషోర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి కార్మికుల భద్రతను నిర్ధారించడానికి పని ప్రదేశాలలో హెల్మెట్‌లు, చేతి తొడుగులు, గమ్ బూట్‌లు, ఇతర రక్షణ వస్తువులను తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించానే. అలాగే ఆయా రిజర్వాయర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై దానకిషోర్ స్పందిస్తూ.. ఇతర అధికారుల సమన్వయంతో క్వాలిటీ అనాలసిస్ వింగ్ జనరల్ మేనేజర్ ద్వారా క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు.