జలకన్యలను చూశారా..? హైదరాబాద్‌కు వచ్చేశారు..!
విదేశాల్లో సముద్ర తీరాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్‌తో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఉంటాయి.
By Srikanth Gundamalla
జలకన్యలను చూశారా..? హైదరాబాద్‌కు వచ్చేశారు..!
కొన్నేళ్ల ముందు టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్ హీరోగా సాహస వీరుడు సాగరకన్య టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి టాక్‌ను సంపాదించుకోవడమే కాదు.. కలెక్షన్లను రాబట్టింది. ఎందుకంటే కొత్త స్టోరీతో రావడమే కారణం. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన శిల్పాశెట్టి సాగరకన్యగా మెప్పించింది. సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. జలకన్యలు ఉంటారో లేదో తెలియదు కానీ.. ఈ పేరు వినగానే అందరికీ శిల్పాశెట్టినే గుర్తుకు వస్తుంది. సగం మనిషిగా.. సగభాగం చేపగా కనిపించే జలకన్యగా అందరినీ అలరించింది. కాగా.. సినిమాలు.. గ్రాఫిక్స్‌లో లేదంటే స్టోరీల్లో వినడమే తప్ప పెద్దగా ఎవరూ జలకన్యను చూసింది లేదు. అయితే.. అప్పుడప్పుడు కొందరు లైక్స్ కోసం చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాగా.. తాజాగా ఈ జలకన్యలు హైదరాబాద్ వచ్చేశారు. నీటిలో ఈదుతూ అందరినీ అలరిస్తున్నారు.
విదేశాల్లో సముద్ర తీరాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్‌తో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఉంటాయి. అక్కడికి వెళ్లే పర్యాటకులను ఈ జలకన్యలను ఆకట్టుకుంటారు. సినిమాల్లో చూపించిన విధంగానే నడుం వరకు మనిషిలా.. కిందిభాగం చేపలా కనిపించేలా రెడీ అయ్యి నీటిలో ఈదుతూ కనిపిస్తారు. తాజాగా ఇలాంటి ఎగ్జిబిషన్‌నే హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా హైదరాబాద్‌లో జలకన్యల థీమ్‌తో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ముగ్గురు యువతులు జలకన్యల రూపంలో నీటిలో విన్యాసాలు చేస్తున్నారు. ఇక జలకన్యల థీమ్ గురించి తెలుసుకున్న నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌కు క్యూ కడుతున్నారు.
ఇప్పటి వరకు సినిమాల్లో జలకన్యలను చూసి థ్రిల్ అయిన జనం.. నేరుగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన జలకన్యలా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువతులు చేస్తున్న విన్యాసాలను చూసి అబ్బురపడుతున్నారు. ఈ థీమ్ ఎగ్జిబిషన్‌కు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు జలకన్యలతో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జలకన్యలను లైవ్‌లో చూడాలనుకుంటే కూకట్‌పల్లిలోని మెరైన్ పార్క్‌లో జరిగే ఎగ్జిబిషన్‌ను సందర్శించండి.