జబర్దస్త్ కామెడి షో లో లేడి గెటప్‌లతో అద్భుతంగా నటిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్( అలియాస్ వినోదిని). తాజాగా తనకు న్యాయం చేయాలని ఈ కమెడియన్ పోలీసులను మరోసారి ఆశ్రయించాడు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని ఆయన ఆఫీసులో కలిసి తను అద్దెకుంటున్న ఇంటి యాజమానిపై ఫిర్యాదు చేసాడు. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఇంటిని విక్రయిస్తానని చెప్పడంతో.. రూ.40లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నామన్నాడు.
ఏడాది క్రితం అడ్వాన్సుగా రూ.13.40లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే.. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని.. లేని పక్షలంలో తాను అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వనని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని జబర్దస్త్ వినోద్ డీసీపీకి వినతిపత్రం అందించాడు. కాగా.. ఈ వ్యవహారంలో వినోద్ పై గతంలో ఇంటి యజమాని దాడి చేశాడు. ఆ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై అప్పట్లో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఫిర్యాదు చేసినా కాచిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మీరైనా నాకు న్యాయం చేయాలని డీసీపీ రమేశ్ కి మొరపెట్టుకున్నాడు వినోద్.