గ్రేటర్ మేయర్‌.. ఆ మ‌హిళా కార్పొరేట‌రేనా..?

Is Mayor Candidate Finalised. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారని వార్త‌లు వ‌స్తోన్నాయి.

By Medi Samrat
Published on : 10 Feb 2021 2:55 PM IST

Gadwal Vijaya Lakshmi

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ గా 93వ డివిజ‌న్ బంజారా హిల్స్ నుండి ఎన్నికైన‌ కార్పొరేట‌ర్‌ గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారని వార్త‌లు వ‌స్తోన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందారు. ఇటీవలే ఎన్నికల సంఘం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

రేపు ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని.. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీల్డ్ కవర్ లో మేయర్ పేరును పంపుతానని కేసిఆర్ చెప్పడంతో దీంతో ఉత్కంఠ పెరిగిపోయింది.

రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో నెలకొంది. దీని ప్రభావం గ్రేటర్, దుబ్బాకలో కనబడిందని నిర్ణయానికి వచ్చిన కేసిఆర్.. మేయర్ పదవిని బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

పార్టీ సీనియర్ నేత కేకే మంగళవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపిన‌ట్లు స‌మాచారం. గత ఎన్నికలలో ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేకే.. తన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని ఇవ్వాలని కోరినట్లు త‌లుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ.. బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలని చేస్తున్న డిమాండ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని.. కేసిఆర్ కు కేకే సూచించార‌ని వార్తలు వినబడుతున్నాయి. ఈ నేఫ‌థ్యంలోనే కేకే నిర్ణయంతో ఏకీభవించిన కేసిఆర్.. బీసీలకే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు.. గద్వాల విజయలక్ష్మి పేరును ఫైనల్ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మేయ‌ర్ ఎవ‌రో..? అస‌లు విష‌యం ఏమిట‌నేది.. రేపు ఉదయం 11 గంటలకు స్పష్టత రానుంది.


Next Story