ఇండియన్ రేసింగ్ లీగ్.. అభిమానులను ఉర్రూతలూగించిన ఫైనల్ రేస్
Indian Racing League: Final race thrills Hyderabad fans. హైదరాబాద్: అడపాదడపా కురుస్తున్న వర్షం రేసింగ్ అభిమానుల ఉత్సాహాన్ని తగ్గించడంలో విఫలమైంది.
By అంజి Published on 12 Dec 2022 8:30 AM ISTహైదరాబాద్: అడపాదడపా కురుస్తున్న వర్షం రేసింగ్ అభిమానుల ఉత్సాహాన్ని తగ్గించడంలో విఫలమైంది. ప్రారంభ ఇండియన్ రేసింగ్ లీగ్ నాలుగో రౌండ్ ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లో జరిగిన సుందరమైన హైదరాబాద్ స్ట్రీట్ రేస్‌లో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లోని మొదటి రౌండ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేయడంతో ఆదివారం జరగాల్సిన చివరి రౌండ్ గురించి చర్చ జరగగా.. చివరకు అది ప్రారంభమైంది. శనివారం షెడ్యూల్ చేయబడిన రేసుల క్వాలిఫైయింగ్, స్ప్రింట్ రేస్‌లు విజిబిలిటీ సమస్యల కారణంగా కేవలం ఒక ట్రయల్ ప్రాక్టీస్ తర్వాత రద్దు చేయబడ్డాయి. ఇది నిర్వాహకులను ఇరకాటంలోకి నెట్టింది.
అయితే లైట్‌గా వర్షం పడుతున్నప్పటికీ రేస్ డే ఆదివారం షెడ్యూల్ ప్రకారం జరిగింది. రేసింగ్‌ను చూసేందుకు ఆదివారం ప్రేక్షకులు భారతదేశపు ఫస్ట్ స్ట్రీట్ సర్క్యూట్‌కు తిరిగి వచ్చారు. రెండు క్వాలిఫైయింగ్ సెషన్ల తర్వాత, వారు రెండు స్ప్రింట్ రేసులు, ఫీచర్ రేసులను చూశారు. నగరంలోని సొంత వీధుల్లో రేసింగ్ కార్లు ఫుల్ థ్రెటల్‌ను తాకడాన్ని చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. నటులు రామ్ చరణ్, నాగ చైతన్య కూడా రేసు ముగింపులో జెండాను ఊపుతూ కనిపించారు. ''ఇది హైదరాబాద్ నగరమని నేను నమ్మలేకపోతున్నాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ మొదటి స్ట్రీట్ సర్క్యూట్ అద్భుతంగా ఉంది'' అని రామ్ చరణ్ అన్నారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం నగర స్థాయిని పెంచిందని నాగ చైతన్య అన్నారు. "ఇది నాకు చాలా అద్భుతమైన క్షణం. మా కాలేజీ రోజుల్లో ఈ వీధుల్లోనే తిరిగేవాళ్లం, ఈ రోడ్లపై రేసింగ్ కార్లు చూడటం థ్రిల్‌గా ఉంది. లీగ్ అద్భుతంగా ఉంది. వారు అద్భుతమైనదాన్ని ప్రదర్శించారు. స్ట్రీట్ రేస్‌లు చాలా ఉత్సాహంగా ఉంటాయి" అని నాగ చైతన్య అన్నారు.
గాడ్‌స్పీడ్ కొచ్చి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రెండు రోజులపాటు జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ విజయవంతంగా ముగిసింది. రేస్‌లో అన్ని రౌండ్లూ కూడా ఎంతో ఉత్కంఠగా సాగాయి. ఆఖరి రౌండ్‌కు వచ్చే సరికి కొచ్చి, హైదరాబాద్ జట్టు మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఆఖరి ఫీచర్ రేస్‌లో చెన్నై జట్టు గెలవగా.. మొత్తంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 417.5 పాయింట్లతో కొచ్చి విజేతగా నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండో స్థానంలో నిలిచింది. 282 పాయింట్లతో గోవా మూడో స్థానం, 279 పాయింట్లతో చెన్నై నాలుగు, 147.5 పాయింట్లతో బెంగళూరు ఐదు, 141 పాయింట్లతో దిల్లీ టీమ్ ఆరు స్థానాల్లో నిలిచాయి. మొదటి రోజు ఆలస్యంగా ప్రారంభమైన రేసులు.. రెండో రోజు షెడ్యూల్ ప్రకారం సమయానికి పూర్తయ్యాయి. సాగర్ చుట్టూ మొత్తం 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఉండగా.. ఏడు ప్రాంతాల్లో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో పోటీలను వీక్షించేందుకు సందర్శకులు తరలివచ్చారు.