డ్రంక్ డ్రైవింగ్ కేసులపై కొరడా ఝుళిపించబోతున్న హైదరాబాద్ పోలీస్

Imprisonment for Drunk driving cases to resume soon in HYD over 7000 cases pending.హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్

By M.S.R  Published on  1 April 2022 3:21 AM GMT
డ్రంక్ డ్రైవింగ్ కేసులపై కొరడా ఝుళిపించబోతున్న హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్ కేసులన్నింటికీ వచ్చే రెండు మూడు నెలల్లో జైలుశిక్షలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఎవి రంగనాథ్ న్యూస్‌మీటర్‌తో తెలిపారు. హైదరాబాద్‌లో మార్చి 2022 నాటికి దాదాపు 7,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు 2014 నుండి పేరుకుపోతున్నాయి.

గత రెండు సంవత్సరాలుగా COVID-19 దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష రద్దు చేయబడింది. " కరోనా మహమ్మారి ముగింపుకు రావడంతో, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జైలుశిక్షను తిరిగి ప్రారంభించాలని అధికారులకు లేఖ రాశాము. శిక్షలను కఠినంగా అమలు చేస్తాము" అని రంగనాథ్ చెప్పారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ దొరికితే మొదటిసారి నేరానికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 2,000 జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.

అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారని రంగనాథ్ తెలియజేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,71,589 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయగా.. 2022 సంవత్సరం మొదటి రెండు నెలల్లో నగరంలో 5,876 కేసులు నమోదయ్యాయి. 2019 సంవత్సరంలో 29,746 కేసులు.. 2018లో 29,484 కేసులు నమోదయ్యాయి. 2020 సంవత్సరంలో 6,857 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరంలో భారీగా ఈ తరహా కేసులు పెరిగాయి.. 29,439 కేసులు నమోదయ్యాయి.

"అర్ధరాత్రి తర్వాత డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక ప్రమాదాలు నమోదవుతున్నాయని మేము గుర్తించాము. మద్యం తాగి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలను నివారించేందుకు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు సంబంధించిన విశ్లేషణ జరుగుతోంది.. త్వరలో ఆయా ప్రాంతాలలో మరింత మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించబోతున్నాం" అని రంగనాథ్ తెలిపారు.

2022 లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 2,498 మంది పట్టుబడ్డారు. సైబరాబాద్, రాచకొండ తర్వాత అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,265.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. 1 జనవరి 2022న, నితిన్ అగర్వాల్ అనే సైక్లిస్ట్ ను మద్యం మత్తులో ఉన్న డ్రైవరు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై చనిపోయాడు. నూతన సంవత్సరం సందర్భంగా కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో వేగంగా వచ్చిన కారు సైకిల్‌ను ఢీకొనడంతో 44 ఏళ్ల సైక్లిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 186గా ఉందని తెలుస్తోంది.

Next Story
Share it