స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్‌ ఏడీ మృతి

IB officer posted for VP security dies in freak accident at Shilpa Kala Vedika.ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ర్య‌ట‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 11:04 AM IST
స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్‌ ఏడీ మృతి

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ర్య‌ట‌న కోసం ముంద‌స్తు భ‌ద్ర‌తా త‌నీఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు స్టేజీపై నుంచి జారిప‌డి ఇంటెలిజెన్స్ బ్యూరో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని మాదాపూర్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కోఠిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పాట్నాకు చెందిన కుమార్‌ అమరేష్‌(51) అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయ‌న జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. కాగా.. ఈ నెల 20న దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పుస్తక ఆవిష్కరణ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు భ‌ద్ర‌తా త‌నిఖీల్లో భాగంగా ఐబీ అధికారులు బుధ‌వారం శిల్పక‌ళా వేదిక కు వ‌చ్చారు.

ఒంటిగంట స‌మ‌యంలో సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీక‌రిస్తున్న కుమార్ అమ‌రేష్ ప్ర‌మాద‌వ‌శాత్తు 12 అడుగుల లోతులో ఉన్న మెయింటెనెన్స్ డెక్ మెట్ల‌పై ప‌డ్డారు. త‌ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కోమాలోకి వెళ్లిన ఆయ‌న రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆయ‌న‌కు భార్య‌, కుమారై, కుమారుడు ఉన్నారు.


Next Story