అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ ఉక్కుపాదం: రూ. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఐలాపూర్‌లో రూ.15 వేల కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు సాగుతున్నాయి.

By -  అంజి
Published on : 11 April 2026 12:00 PM IST

HYDRAA Operation, Ameenpur Encroachments, Sangareddy Land Grabbing, Ailapur Village Govt Land, Mukheem Guest House Demolition, Telangana Revenue Department, Hydra Demolition Drive

అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ ఉక్కుపాదం: రూ. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్‌: అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఐలాపూర్‌లో రూ.15 వేల కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు సాగుతున్నాయి. కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసి నిర్మించిన గెస్ట్‌హౌస్‌తో పాటు మరో 6 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను అధికారులు కూల్చివేశారు.

అమీన్‌పూర్ మండలంలో ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా (HYDRAA) మరోసారి వణుకు పుట్టించింది. ఐలాపురం విలేజ్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.

కోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. గెస్ట్ హౌస్ నేలమట్టం

ఐలాపురం పరిధిలోని సర్వే నంబర్లలో 1998 నుంచి ‘యథాతథ స్థితి’ (Status Quo) కొనసాగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ నిర్మించిన ముఖీమ్ గెస్ట్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలాగే ముఖీమ్ సోదరుడు అజీమ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని సైతం నేలమట్టం చేశారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పేదల జోలికి వెళ్లలేదు.. స్పష్టం చేసిన అధికారులు

ఈ ఆపరేషన్‌లో ఒక కీలక అంశం చర్చనీయాంశమైంది. ఐలాపురం తండాలో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను గానీ, నివాసాలను గానీ హైడ్రా తాకలేదు. నివాసాల జోలికి వెళ్లకుండా కేవలం అక్రమంగా నిర్మించిన వాణిజ్య కట్టడాలు, గెస్ట్ హౌస్‌లను మాత్రమే టార్గెట్ చేసింది. తండాలోని నివాసాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలను ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంది.

రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి రక్షణ

ఐలాపురం విలేజ్ పరిధిలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే చాలా వరకు నివాస గృహాలు వెలిశాయి. అయితే, మిగిలి ఉన్న 860 ఎకరాల విలువైన భూమిని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల నుంచి కాపాడి, భవిష్యత్ అవసరాలకు వినియోగించడమే హైడ్రా ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

Next Story