రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా

రుక్న్‌-ఉద్‌-దౌలా సరస్సు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు.

By Srikanth Gundamalla
Published on : 10 Aug 2024 6:47 PM IST

hydraa, demolishes, illegal structures,  bum rukn ud dowla lake,

రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు సైబరాబాద్‌ పోలీసులు, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి రుక్న్‌-ఉద్‌-దౌలా సరస్సు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు. తద్వారా హైడ్రా పది ఎకరాలను రికవరీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అంతే కాకుండా చందానగర్‌లోని ఎర్ల చెరువులో నిర్మాణంలో ఉన్న భవనం, అనధికార లేఅవుట్‌లోని కాంపౌండ్‌వాల్‌లు, అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రాకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు కూల్చివేశాయి. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ద్వారా..రుక్న్-ఉద్-దౌలా సరస్సు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) సామర్థ్యానికి సంబంధించిన సుమారు 10 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రై సిటీల పరిధిలోని ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్లలోని అనధికార నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రజల నుంచి వరుస ఫిర్యాదుల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించినట్లు హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ తెలిపారు. “రియల్టర్లు మరియు బిల్డర్లు బఫర్ జోన్‌లు, ఎఫ్‌టిఎల్ పరిమితుల్లో నిర్మాణ కార్యకలాపాలను చేపడితే మేము అన్ని అక్రమ నిర్మాణాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చివేస్తాము. రియల్టర్లు, బిల్డర్లపైనే కాకుండా నగరంలో అక్రమ నిర్మాణాలకు మద్దతిస్తే ప్రభుత్వ అధికారులు, వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సరస్సుల సమీపంలోని బఫర్‌జోన్‌కు 30 మీటర్ల లోపు ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, ఇతర ఆస్తుల కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రంగనాథ్ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా తక్కువ ధరలకు ఆకర్షితులై భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తే ప్రజలు భారీగా నష్టపోతారు. సందేహాల కోసం, ప్రజలు హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయాన్ని సందర్శించవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అక్రమ స్థలాల్లో భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయకుండా అనుసరించాల్సిన చర్యల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు.


Next Story