హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!

హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2023 1:33 PM IST
Hyderabad, Woman missing, Hussain Sagar ,

 హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!

హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఎస్బీఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్‌లో నివాసం ఉంటోంది. లక్ష్మి అనే మహిళకు 55 ఏళ్లు. ముగ్గురు కూతుళ్లు ఉండగా.. వారి అందరికీ వివాహాలు జరిపించింది. అయితే.. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే నివసిస్తోంది. ఆదివారం నుంచి లక్ష్మీ కనింపించడం లేదని ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే.. కూతురి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు.. ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. హుస్సేన్ సాగర్ నాలా పక్కనే లక్ష్మీ ఇల్లు ఉంది. అంతేకాక.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆమె ఇంటి ప్రహారి గోడ కూలిపోయింది. దాంతో.. కాలువలో ప్రవహిస్తున్న నీరు ఇంటి వరకూ ఉంది. ఇల్లు కాస్త ఎత్తులో ఉండటంతో వెనుక డోర్‌ తెరిస్తే ప్రమాదంలో పడినట్లే. ప్రహారీ గోడ లేకపోవడంతో లక్ష్మీ తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంది. కాగా.. తల్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని గమనించిన కూతుళ్లు ఇంటికి వచ్చారు. కానీ.. అక్కడ ఆమె కనిపించలేదు. దాంతో.. తమ తల్లి హుస్సేన్‌ సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిందని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటిని పరిశీలించిన పోలీసులు.. లక్ష్మి ఇంట్లో అన్నం వండుకునేందుకు బియ్యం సిద్ధం చేసిందని.. ఆమె చెప్పులు కూడా అక్కడే ఉన్నాయని చెబుతున్నారు. దాంతో.. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంటి నుంచి లక్ష్మీ ఎక్కడికీ బయటకు వెళ్లలేదని చెబుతున్నారు. దాంతో.. ఆమె ప్రమాదవశాత్తు హుస్సేన్‌ సాగర్ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story