Hyderabad: ఆడుకుంటూ ఉండగా కూలిన గోడ.. ఇద్దరు చిన్నారులు మృతి
ఈ విషాద సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌నగర్‌లో జరిగింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:17 PM ISTHyderabad: ఆడుకుంటూ ఉండగా కూలిన గోడ.. ఇద్దరు చిన్నారులు మృతి
వర్షాకాలం వచ్చేసింది. వానలు ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి మొత్తం వర్షం పడుతూనే ఉంది. అయితే.. వర్షాలు పడుతున్న క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. పాతబడ్డ ఇళ్లలో ఉండొద్దని చెబుతూ ఉంటారు. గతంలో జరిగిన విషాదాలను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేస్తుంటారు. ఆదివారం నిరంతరాయంగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో ఒక గోడ కూలింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌నగర్‌లో జరిగింది. వర్షం ఎక్కువగా పడటంతో స్థానికంగా ఓ ఇంటి వద్ద ఉన్న గోడ బాగా నానిపోయింది. దాంతో బలహీనపడిపోయింది. ఇక సోమవారం ఉదయం నలుగురు పిల్లలు గోడ వద్దే ఆడుకుంటున్నారు. వారు ఆడుకుంటున్న సమయంలోనే ఉన్నట్లుండి వానకు బాగా నాని బలహీనపడ్డ ఆ గోడ కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు నూర్జాన్ నూర్ జాన్(8), ఆసిఫ్ పర్వీన్(3) గా పోలీసులు చెప్పారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
కాగా.. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గోడ కింద ఇరుక్కున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఇక ఇదే ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రత్తంగా ఉండాలని... సురక్షితమైన ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో విషాదం.. మైలార్దేవ్పల్లిలో వర్షానికి కూలిన గోడ
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 3, 2024
ప్రమాదంలో నూర్జాన్ నూర్ జాన్(8),ఆసిఫ్ పర్వీన్(3) అనే ఇద్దరు చిన్నారులు మృతి pic.twitter.com/mAYuD5hdF0