రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. చార్మినార్ సందర్శన నిలిపివేత
జూలై 29, శనివారం జరగనున్న ఆశురా ఊరేగింపుకు ముందు, పాతబస్తీలో ట్రాఫిక్ రహితంగా ఉండేలా నగర ట్రాఫిక్ పోలీసులు మళ్లింపులను విడుదల చేశారు.
By అంజి Published on 28 July 2023 8:15 AM ISTరేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. చార్మినార్ సందర్శన నిలిపివేత
హైదరాబాద్: జులై 29న మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చార్మినార్‌ను సందర్శకులకు, సామాన్యులకు మూసివేయనున్నట్లు భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. "అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, చార్మినార్ డివిజన్, హైదరాబాద్ అభ్యర్థన మేరకు.. సెంట్రల్ రక్షిత స్మారక చిహ్నం చార్మినార్‌ని ప్రజల సందర్శనార్థం 29-07-2023న మూసివేయబడుతుంది. టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం కూడా పనిచేయదు" శనివారం ఇమామ్ హుస్సేన్ అమరవీరునికి గుర్తుగా 400 ఏళ్ల సంప్రదాయమైన సంతాప ఊరేగింపులో వేలాది మంది షియా ముస్లింలు పాల్గొననున్నారు. ఊరేగింపు స్మారక చిహ్నం చార్మినార్ దాటి వెళుతుంది.
ఇదిలా ఉంటే.. జూలై 29, శనివారం జరగనున్న ఆశురా ఊరేగింపుకు ముందు, పాతబస్తీలో ట్రాఫిక్ రహితంగా ఉండేలా నగర ట్రాఫిక్ పోలీసులు మళ్లింపులను విడుదల చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయనుండగా.. మరికొన్ని రూట్లలో వాహనదారులను వేరే మార్గాలకు దారి మళ్లించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఊరేగింపు సమయంలో బీబీ కా అలవా దబీర్‌పురా నుండి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
చార్మినార్, గుల్జార్ హౌజ్, బీబీ కా అలవా రోడ్, షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, సూరజ్ టాకీస్, సర్దార్ మహల్, పంజేషా, మండి మీర్ ఆలం, పురానీ హవేలీ, దారుల్షిఫా, ఎతేబాజ్ చౌక్, అలీజా కోట్లా, మెస్కో, ఇమ్లిబాన్, చాదర్‌ఘాట్ రూట్లలో ట్రాఫిక్ దారి మళ్లింపు ఉంటుంది. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని, రద్దీగా ఉన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. మొహర్రం ఊరేగింపు అషూర్ఖానా బీబీ-కా-అలావా వద్ద ప్రారంభం కానున్న ఊరేగింపు చాదర్‌ఘాట్‌లోని మస్జిద్-ఇ-ఇలాహి వద్ద ముగుస్తుంది.