యువతి కొంపముంచిన సోషల్ మీడియా పరిచయం
యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:09 AM ISTయువతి కొంపముంచిన సోషల్ మీడియా పరిచయం
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చిన్నది అయిపోయింది. స్నేహితులు పెరిగిపోతున్నారు.. ప్రపంచం నలుములలా ఏం జరిగినా క్షణాల్లో కళ్ల ముందుకు వచ్చేస్తోంది. అయితే.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇబ్బందులు కూడా అదే రేంజ్‌లో ఎదురవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సోషల్‌మీడియా పరిచయంతో మోస పోయింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రోజూ చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త స్నేహంగా మారింది. మాటలు పెరిగాయి. మెల్లిగా యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. మాయమాటలకు పడిపోయిన సదురు యువతి అతడిని నమ్మింది. తాను కూడా ఇష్టపడుతున్నట్లుగా చెప్పింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు. దాంతో.. యువతి అతడిని పూర్తిగా నమ్మేసింది. అదే అదునుగా చేసుకున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.
యువతిని ఓసారి కలుద్దాం అంటూ పిలిచాడు. ఆ తర్వాత నగరంలోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన అనంతరం యువకుడు దుబాయ్‌కి చెక్కేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడంటూ యువకుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.