ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 3:00 AM GMTఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నెల 10న ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌కు చేరుకుని ఆక్రమణదారులను రెచ్చగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చి వేసినట్టు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపయ్య ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు.
నందగిరిహిల్స్ లేఅవుట్‌లో 850 గజాల జీహెచ్‌ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని పాపయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్‌ఎంసీ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చివేశారని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. వారు కూల్చివేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పాపయ్య పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దాంతో.. ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లపై బీఎన్‌ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది.