హైదరాబాద్‌లో 4,000 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం.. జెజె ఫుడ్ యజమాని అరెస్టు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఒక భారీ కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని ఛేదించారు.

By -  అంజి
Published on : 27 Feb 2026 7:47 AM IST

Adulterated Ginger-Garlic Paste, Hyderabad Task Force Raid, Khairtabad News, Food Safety Hyderabad, JJ Food Adulteration, FSSAI License Expired, BNS Sections, Health Risk

హైదరాబాద్‌లో 4,000 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం.. జెజె ఫుడ్ యజమాని అరెస్టు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఒక భారీ కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని ఛేదించారు. ఎంఎస్ మక్తా ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ప్రాణహాని కలిగించేలా ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అబిడ్స్‌కు చెందిన 21 ఏళ్ల వ్యాపారి జసాని ఇలియాన్‌.. 'జెజె ఫుడ్' (JJ Food) పేరుతో ఈ కల్తీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పోలీసులు సుమారు 4,000 కిలోల కల్తీ పేస్ట్‌తో పాటు తయారీకి ఉపయోగించే యంత్రాలను, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహించిన అధికారులకు అక్కడ విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి.

పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి, దుమ్ము, ఈగలు వాలుతున్నా పట్టించుకోకుండా తయారు చేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. నిందితుడు ఎక్స్‌పైరీ (గడువు ముగిసిన) అయిన FSSAI లైసెన్స్‌తో ఈ ఉత్పత్తులను నగరంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, హోల్‌సేల్ డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఇతను చెలగాటం ఆడాడని పోలీసులు గుర్తించారు. లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), 275 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

- 4,000 కిలోల కల్తీ పేస్ట్

- 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్ (నిల్వ ఉంచడానికి వాడే రసాయనం).

- 1,000 కిలోల ఉప్పు, 5 కిలోల పసుపు పొడి.

- గ్రైండింగ్ మెషీన్లు, ఒక సరుకు రవాణా ఆటో.

Next Story