పోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ
డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 11:03 AM GMTపోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ
విలాసాలకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు దొంగతనాలు చేస్తుంటారు. ఇంకొందరు అయితే.. పని చేసేందుకు బద్దకించి ఈజీగా మనీ సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో దొంగలు వారి వారి తెలివిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలని ట్రై చేసిన ఏదో ఒక మారువేశంలో వచ్చి దెబ్బకొడుతుంటారు. సరిగ్గా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. క్యాబ్ డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.
హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని ఓ ప్రయాణికుడు క్యాబ్ ఎక్కాడు. మార్గ మధ్యలో క్యాబ్ డ్రైవర్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు.తాను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచీ పోలీస్‌గా పరిచయం చేసుకుని నమ్మించాడు. ఆ తర్వాత అదును చూసుకుని కారు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్దకు రాగానే.. కారులో ఉన్న వ్యక్తి తనకు బిర్యానీ కావాలని అడిగాడు. దాంతో.. నువ్వే తీసుకురావా వెళ్లి అంటూ క్యాబ్ డ్రైవర్‌ను హోటల్‌కు పంపాడు. పాపం డ్రైవర్ అతనిలో ఉన్న దొంగ బుద్ధిని తెలుసుకోకుండా కారు ప్రయాణికుడికి అప్పజెప్పి వెళ్లాడు. డ్రైవర్ అలా వెళ్లగానే.. దొంగ తన చేతివాటం చూపించాడు. వెనక సీటు నుంచి ముందు సీట్లోకి వచ్చి.. కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తీరా బిర్యానీ తీసుకుని పార్కింగ్ వద్దకు వచ్చే సరికి.. కారు కనిపించలేదు. దాంతో.. క్యాబ్ డ్రైవర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.