వింత ఘటన: పిల్లులకు పోస్టుమార్టం చేయాలని వ్యక్తి డిమాండ్
ఓ వ్యక్తి తన పిల్లులు అనుమానాస్పదంగా మృతిచెందాయని.. వాటికి పోస్టుమార్టం నిర్వహించాలంటూ వైద్యులను కోరాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 5:26 AM GMTవింత ఘటన: పిల్లులకు పోస్టుమార్టం చేయాలని వ్యక్తి డిమాండ్
హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పిల్లులు అనుమానాస్పదంగా మృతిచెందాయని.. వాటికి పోస్టుమార్టం నిర్వహించాలంటూ వైద్యులను కోరాడు. కొందరు కావాలనే వాటిని హత్య చేశారంటూ ఆరోపణలు చేస్తున్నాడు.
హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 10 పిల్లులను పెంచుకుంటున్నాడు. అయితే.. ఆ పిల్లులు అతని ఇంట్లోనే ఉండకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి ప్రవేశించసాగాయి. దాంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు యజమానికి పలుసార్లు హెచ్చరించారు. పిల్లులు పదే పదే తమ ఇంట్లోకి వస్తున్నాయని.. అలా రాకుండా చూసుకోవాలని సూచించారు. కానీ.. తరచూ అదే రిపీట్ అయ్యింది. ఒక రోజు ఉన్నట్లుండి పది పిల్లుల్లో 6 పిల్లులు మృతి చెందాయి. దాంతో.. వాటి యజమాని లబోదిబో మంటున్నాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లులను చుట్టుపక్కల ఉన్నవారే కోపంతో విషం పెట్టి చంపారని ఆరోపిస్తున్నాడు. అసలు పిల్లులు ఎలా చనిపోయాయో తెలుసుకోవాలని ఉందని.. పోస్టుమార్టం నిర్వహించాలని వైద్యులను కోరాడు యజమాని.
అయితే.. పోస్టుమార్టం చేసేందుకు కుదరదని వైద్యులు తెలిపారు. కానీ.. ఆ వ్యక్తి పట్టువిడవకుండా గాంధీ మార్చురీకి తీసుకెళ్లాడు. నిబంధనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. కేసు నమోదు అయితేనే తాము పోస్టుమార్టం చేసేందుకు వీలు కుదురుతుందని వైద్యులు తెలిపారు. దాంతో.. తాను ప్రేమగా పెంచుకున్న పిల్లులు ఎలా చనిపోయాయో తెలుసుకోవాలని.. వాటి హత్యల వెనుక ఉన్నవారికి తగిన శాస్తి జరగాలని భావించాడు. వెంటనే వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కేసు నమోదు కావడంతో వైద్యులు కూడా పిల్లులకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. ఇక దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.