నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 12 July 2024 7:52 AM ISTనాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతుండటం కలవరం రేపుతున్నాయి. తాజాగా రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.. దాంతో.. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానిత వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దాంతో.. ఈ కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన మార్గంలో ఈ కాల్పులు చోటుచేసుకోవడంతో అంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు.
తెల్లవారుజామున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు ప్రశ్నిస్తుండగా నిందితులు పోలీసులపైకి దాడికి దిగారు. రాళ్లు, గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించారు. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యి కాల్పులు జరిపారు. నగర శివార్లలో దోపిడీలకు పాల్పడే నిందితులు రైల్వే స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు చోటు చేసుకోవడం నాలుగోసారి జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎల్‌బి నగర్ సమీపంలో కూడా పార్దీముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.