మెట్రో, బస్సు ప్రయాణ వేళలు పొడిగింపు
Hyderabad Metro timings changed.కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2021 2:45 PM ISTకరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు నేటి వరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లలో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటల కల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. మెట్రో సర్వీస్ వేళలను పెంచడంతో పనులు చేసుకునే వారికి చాలా ఇబ్బందులు తొలగనున్నాయి.
ఇదిలావుంటే.. TSRTC జిల్లాలకు నడిపే బస్సులను ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకే నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఉ.6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని TSRTC గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపు టైంలో సిటీ బస్సులను తిప్పుతామన్నారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉ.6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.