ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
ఎండల్లో కూల్‌కూల్‌గా ప్రయాణాలు చేయొచ్చులే అనుకుంటున్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:00 PM ISTప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు ఉదయం 10 గంటలు దాటి బయటకు రాలేని పరిస్థితి. ఎండ వేడిమి కారణంగా ఇంట్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఇక తప్పనిసరై ప్రయాణాలు చేయాల్సి వస్తే వడగాల్పులకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిత్యం ప్రజలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ ఉంటే ఇక అంతేసంగతులు. ఈ క్రమంలోనే చలచల్లగా ఉండే మెట్రోను ఎంచుకుంటున్నారు. ఎండకాలం సమయంలో అయితే హైదరాబాద్ మెట్రోకు అధిక గిరాకీ వస్తోంది. అయితే.. తాజాగా హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు షాక్ ఇచ్చింది
ఎండల్లో కూల్‌కూల్‌గా ప్రయాణాలు చేయొచ్చులే అనుకుంటున్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో. ఇప్పటి వరకు ఇస్తోన్న రాయితీకి మంగళం పాడింది. ఈ మేరకు నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో ఇక నిత్యం ప్రయాణించే వారి కోసం గతంలో అధికారులు రూ.59 హాలీడే కార్డును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణం చేసే టికెట్ పై పది శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగిపోయాయి. బస్సులు, బైకులపై వెళ్లేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. సిటీ వాసులకు మాత్రం ఏసీ మెట్రో రైలులో వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికే మెట్రో యాజమాన్యం హాలీడే కార్డును రద్దు చేసిందని ప్రయాణికులు మండిపడుతున్నారు.