హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం

Hyderabad Metro Rail mulls revision of fares, seeks passengers’ views. హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీలు త్వరలోనే పెరగనున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్‌ మెట్రో సంస్థ ప్రణాళికలు

By అంజి  Published on  31 Oct 2022 3:49 AM GMT
హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీలు త్వరలోనే పెరగనున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్‌ మెట్రో సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న ఛార్జీల సవరణకు సంబంధించి హైదరాబాద్‌ మెట్రో అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఛార్జీల సవరణకు సంబంధించి మెట్రో ప్రయాణికుల నుంచి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) సూచనలు కోరింది. హైదరాబాద్‌ మెట్రో రైలు మూడు లైన్లలో పనిచేస్తోంది. రెడ్ లైన్ (మియాపూర్-ఎల్‌బి నగర్) 27 స్టేషన్‌లతో, గ్రీన్ లైన్ (జేబీఎస్‌- (ప్రస్తుతం ఎంజీబీఎస్‌ వరకే) ఫలక్‌నుమా) 15 స్టేషన్‌లు, బ్లూ లైన్ (నాగోల్-రాయదుర్గ్) 24 స్టేషన్‌ల మధ్య రైళ్లు నడుస్తున్నాయి. టికెట్ ఛార్జీల విషయానికొస్తే, ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్‌కు కనీస ఛార్జీ రూ.10, గరిష్ట ఛార్జీ రూ.60లు తీసుకుంటున్నారు.

హెచ్‌ఎమ్‌ఆర్‌ కోసం ఛార్జీల సవరణను సిఫార్సు చేయడం కోసం భారత ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ తదనుగుణంగా ఛార్జీల సవరణకు సంబంధించి ప్రయాణీకుల సూచనలను ఆహ్వానించింది. ''మెట్రో రైలు ఛార్జీల సవరణపై నిర్ణయం తీసుకోవడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఎఫ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేయబడింది. మీ సూచనలను అందించడానికి మీకు స్వాగతం'' అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్) అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.

ప్రయాణికులు తమ సూచనలను ffchmrl@gmail.comకు పంపవచ్చు లేదా చైర్మన్, FFC, మెట్రో రైలు భవన్, బేగంపేట్, సికింద్రాబాద్ - 500003, తెలంగాణకు నవంబర్ 15 లోపు చేరుకోవడానికి పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇటీవల, అన్ని స్టేషన్ల నుండి అధిక ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్‌ మెట్రో రైలు తన సర్వీస్ టైమింగ్‌ను రాత్రి 11 గంటల వరకు పొడిగించింది. అయితే మొదటి సర్వీస్ ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ త్వరలోనే మెట్రో ఛార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. అయితే స్వల్పంగా మెట్రో ఛార్జీలు పెరిగే ఛాన్స్‌ ఉందని మెట్రో వర్గాలు అంటున్నాయి.


Next Story