మరో మైలురాయిని చేరుకున్న హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్‌ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  3 May 2024 7:57 AM IST
Hyderabad, metro rail,  milestone,

మరో మైలురాయిని చేరుకున్న హైదరాబాద్ మెట్రో 

హైదరాబాద్‌ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు.. ట్రాఫిక్‌ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది ఈ మెట్రో ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. ప్రయాణం చేసినంత సేపు అయినా చల్లచల్లగా ఏసీలో వెళ్లొచ్చని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో మరో మైలురాయిని అందుకున్నది. ఏకంగా ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో 50 కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చి చరిత్రను లిఖించింది. దేశంలోనే మూడో అతిపొడవైన మెట్రో వ్యవస్థగా హైదరాబాద్‌ మెట్రో గుర్తింపు పొందింది. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే మెట్రో ఈ రకమైన రికార్డులను సాధించడం గొప్ప విషయం.

కాగా.. మియాపూర్‌-అమీర్‌పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతూనే ఉన్నారు. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్‌-రాయ్‌దుర్ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నిత్యం హైదరాబాద్ మెట్రోలో 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. కాగా.. 2017 నుంచి ఇప్పటి వరకు 50 కోట్ల‌ మంది మెట్రోలో ప్రయాణించడంతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మరో మైలు రాయిని అధిగమించినట్లు అయ్యింది. గతేడాది జూలైలో ఒక్క రోజులోనే 5.1 లక్షల మంది గమ్యస్థానాలకు చేర్చింది హెచ్‌ఎంఆర్‌ఎల్‌.

Next Story