మరో మైలురాయిని చేరిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రక మైలురాయిని చేరుకుంది. రోజూ ప్రయాణం చేసేవారి సంఖ్య 5లక్షలు దాటింది.
By Srikanth Gundamalla Published on 4 July 2023 5:05 PM ISTమరో మైలురాయిని చేరిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే 2, 3 కిలోమీటర్లకే గంట సమయం పట్టిన రోజులూ ఉన్నాయి. అయితే.. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడమే కాదు.. సురక్షితం కావడంతో మెట్రోల్లో జనాలు ఎక్కువగా ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రక మైలురాయిని చేరుకుంది. రోజూ ప్రయాణం చేసేవారి సంఖ్య 5లక్షలు దాటింది. దీంతో.. మెట్రో రైల్ ప్రయాణికులకు ధన్యవాదాలు చెప్పారు.
హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణం చేసేవారి సంఖ్య 5లక్షలు దాటినందుకు ముందుగా ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ మరియు సీఈవో కేవీబీ రెడ్డి. తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రయాణికులకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. సిబ్బంది కృషి ద్వారా ఈ విజయం సాధించగలిగామన్నారు కేవీబీ రెడ్డి. అలాగే తమకు ఎంతో సహకారం అందిస్తోన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలు సహకారం, మద్దతు ఇవ్వడంతోనే వేగవంతమైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించగలిమని కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.