Hyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 1:32 PM ISTHyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు
హైదరాబాద్ మెట్రోకు గిరాకీ బాగా పెరిగింది. ఎండలు దంచికొడుతున్న వేళ ప్రయాణికులు ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. ఎండ వేడిమి కారణంగా బస్సులు.. బైకులపై జర్నీకి దూరంగా ఉంటున్నారు. దాంతో.. మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగిపోయింది. ఇక ఇటీవల మెట్రో రైలు యాజమాన్యం పలు ఆఫర్లను నిలిపివేస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక తమకు మెట్రో ప్రయణం కచ్చితమైన సమయంలోనే ఆఫర్లను తీసివేయడంతో ప్రయాణికులు యాజమాన్యంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా స్పందించిన హైదరాబాద్ రైల్ కీలక ప్రకటన చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా.. గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన సూపర్ సేవర్ ఆఫర్-59 ఆఫర్‌ను ప్రారంభించారు. అయితే.. దాన్ని 2024 ఏడాది మార్చి 31న ఈ ఆఫర్ ముగిసింది. దాంతో.. ఏప్రిల్ 1 నుంచే ఎల్‌అండ్‌టీ అధికారులు ఈ ఆఫర్‌ను రద్దు చేశారు. అంతేకాదు.. స్మార్ట్ కార్డు, కాంటాక్ట్ లెస్ కార్డులపై ఉన్న 10 శాతం రాయితీని కూడా ఎత్తివేశారు. మెట్రో స్టూడెంట్ పాస్‌ను కూడా తొలగించడంతో ఆయా వర్గాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వేసవి సందర్భంగా రద్దీ పెరగడంతోనే దాన్ని క్యాష్ చేసుకుంనేందుకు యాజమాన్యం ఈ ఆఫర్లను రద్దు చేసిందని మండిపడ్డారు.
ప్రయాణికుల కోరిక మేరకు హైదరాబాద్ మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు స్పందించారు. ఆయా ఆఫర్లను తిరిగి కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రూ.59తో నడిచే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు మంగళవారం నుంచి ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందని అధికారులు చెప్పారు.