Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
బతుకమ్మ కార్యక్రమంలో డీజేను ఉపయోగించినందుకు
By Medi Samrat Published on 13 Oct 2024 8:17 PM ISTబంజారాహిల్స్‌లోని ఎన్‌బిటి నగర్‌లో బతుకమ్మ కార్యక్రమంలో డీజేను ఉపయోగించినందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ వేదికపై నుంచి ప్రసంగించడమే కాకుండా జానపద నృత్యం కూడా చేశారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీజేను ఆపేయాలని ప్రజలను కోరారు. బతుకమ్మ పాటలు ఉండాలని, ప్రస్తుతానికి తాము డీజేని ఉపయోగించడానికి అనుమతించాలని మేయర్ పోలీసులతో వాదించారు. పరిస్థితి చేజారుతానందని భావించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ వేడుకల సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో మహిళలు పెద్ద ఎత్తున DJ సంగీతానికి నృత్యం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. "మేము ఇక్కడ బతుకమ్మ జరుపుకుంటున్నాము, కొంతమంది వ్యక్తులు మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు" అని గద్వాల విజయలక్ష్మి ఈ వివాదంపై వ్యాఖ్యలు చేశారు. వేదిక వద్ద డీజే చాలా బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడంపై స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మతపరమైన కార్యక్రమాల సమయంలో DJలు, బాణసంచా వాడకాన్ని ఇటీవలే హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. సౌండ్ సిస్టమ్‌లు అనుమతించినా తప్పనిసరిగా అధికారులు సూచించిన డెసిబెల్స్ లోబడే ఉండాలి.
Next Story