హైదరాబాద్‌కు పెరుగుతున్న టమాటా దిగుమతి..ఇక తగ్గనున్న ధరలు
టమాటా దిగుమతి కాస్త పెరుగుతోందని చెబుతున్నారు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 5:09 AM GMTహైదరాబాద్‌కు పెరుగుతున్న టమాటా దిగుమతి..ఇక తగ్గనున్న ధరలు
నెల రోజులకు పైగా అవుతోంది టమాటా ధరలు చుక్కలు చూపిస్తోంది. సామాన్యుడు మార్కెట్‌కు వెళ్తే కూరగాయలు కొనలేని పరిస్థితి. టమాటా అయితే మరింత ప్రీమియమ్ అయిపోయింది. కూరల్లో టమాటా వేసేందుకు కూడా వెనకాడారు కొందరు ప్రజలు. హైదరాబాద్‌లో కిలో దాదాపు రూ.180 వరకు పలికింది. ఇక దేశంలో పలు చోట్ల అయితే రూ.200 కూడా దాటినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం టమాటా దిగుమతి పెరుగుతోంది. రైతు బజారులో కిలో టమాటా రూ.63 ఉంటే.. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి 140 వరకు విక్రయిస్తున్నారు.
టమాటా ధరలతో సామాన్యుల ఇబ్బందులు ఏమో కానీ.. కొందరు రైతులు మాత్రం బాగా లాభపడ్డారు. పెద్దమొత్తంలో టమాటా సాగు చేసి ఈ గత నెలలో పంట చేతికొచ్చిన వారు లక్షాధికారులు అయ్యారు. కొందరైతే కోట్లు సంపాదించారు. అయితే.. టమాటా ధరలు పెరగడానికి ముఖ్యకారణం ఆ పంట దిగుబడి ఎక్కువగా లేకపోవడం. అకాల వర్షాలకు టమాటా సాగు చాలా చోట్ల దెబ్బతిన్నది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు టమాటా దిగుమతి కాస్త పెరుగుతోందని చెబుతున్నారు వ్యాపారులు. హైదరాబాద్‌కు టమాటా రాక పెరిగిందని చెబుతున్నారు. నగరానికి 10 రోజుల కిందట కేవలం 850 క్వింటాళ్ల సరకు వస్తే.. ఆగస్టు 7న 2450 క్వింటాళ్లు హోల్‌సేల్ మార్కెట్ వచ్చింది.
ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి టమాటా దిగుబడి ఉంది. అంతేకాక.. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్ జిల్లా నుంచి కూడా మార్కెట్‌కు టమాటా వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా టమాటా ధర తగ్గుతోందని వివరిస్తున్నారు. ప్రస్తుతం కిలో టమాటా రూ.100పైగానే ఉన్నా.. ఈ నెలాఖరు వరకు రూ.50లోపు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. టమాటా నగరానికి వస్తున్న దిగుబడి మేరకు హోల్‌సేట్ మార్కెట్‌లో డిమాండ్ ఆధారంగా అధికారులు ధరలు నిర్ణయిస్తారు. ఇక నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి ధర నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే అమ్మాలని ఆదేశిస్తారు. దిగుమతి తక్కువగా ఉండటంతో వ్యాపారులు అన్ని రకాలను ఒకే ధరకు అమ్ముతున్నారు.