రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఉక్రెయిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని స్నేహితులు, బంధువులను ఆహ్వానించి ఫిబ్రవరి 27న రిసెప్షన్ నిర్వహించాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్‌కి ఉక్రెయిన్‌కు చెందిన లియుబోవ్‌తో పరిచయం ఏర్పడింది. అది తొలి చూపులోనే ప్రేమగా మారింది. ఇద్దరూ తమ జీవితాంతం కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 23 న ఉక్రెయిన్‌లో వివాహం చేసుకున్నారు. రష్యా మిలిటరీ ఉక్రెయిన్ దేశంపై దాడికి ఒక రోజు ముందు వీరి వివాహం జరిగింది. అయితే ఆ వెంటనే భారత్‌కు వచ్చిన ఈ జంట హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. మల్లికార్జునరావు, పద్మజ దంపతుల కుమారుడు వరుడు ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో పూర్వ విద్యార్థి.
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్దాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నిహితులు, బంధువుల మధ్య రిసెప్షన్ నిర్వహించారని చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతూ చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సీఎస్ రంగరాజన్ తెలిపారు. భారతీయులను తిరిగి దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించిన కేంద్రం ఉక్రెయిన్ నుండి మోల్డోవా, రొమేనియా, స్లోవేకియా, పోలాండ్, హంగేరి మీదుగా భారత పౌరులను స్వదేశానికి రప్పిస్తోంది.