వరద నుంచి బయటపడేందుకు కరెంట్‌పోల్‌ను పట్టుకున్న వ్యక్తి.. కానీ..
తెలంగాణలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 10:29 AM ISTవరద నుంచి బయటపడేందుకు కరెంట్‌పోల్‌ను పట్టుకున్న వ్యక్తి.. కానీ..
తెలంగాణలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తిలో కూడా ఓ యువకుడు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాడు. అయితే.. ఉన్నట్లుండి వర్షం భారీగా పడటంతో రోడ్లపై వరద ప్రవహించింది. ఆ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కిందపోయేంత పని అయ్యింది. దాంతో.. తప్పించుకునేందుకు అతను రోడ్డుపక్కనే ఉన్న కరెంట్ పోల్‌ను పట్టుకున్నాడు. అంతే.. విద్యుత్‌షాక్ కొట్టింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ పాతబస్తీలో బహదూర్పురాలో చోటుచేసుకుంది ఈ విషాదకర సంఘటన. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద వచ్చింది. దాదాపు మొకాళ్ల కింద వరకు వరద వచ్చింది. అయినా కూడా ఇళ్లకు చేరుకోవాలని అనుకున్న వారు వాహనాల్లో రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు బహదూర్‌పురాలో వరద ఎక్కువగా ఉన్న రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చివర నుంచి ఈ చివర వరకు కాస్త కష్టంగానే వచ్చాడు. అయితే.. చివరి అడుగు సరిగ్గా పడకపోవడంతో అతను కిందపడిపోయేంత పని అయ్యింది. దాంతో.. అతను కిందపడిపోకుండా ఉండేందుకు కరెంట్ పోల్‌ను పట్టుకున్నాడు.
ఇదే అతను చేసిన తప్పుగా మిగిలిపోయింది. మృత్యువు అతన్ని వెంటాడింది. ఆ కరెంట్ పోల్‌ను పట్టుకోవడం ద్వారా విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.