ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం కొద్దిసేపటి క్రితం పూర్తయ్యింది. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనం కార్యక్రమం జరిగింది. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు గణపతికి 'బై బై గణేషా' అంటూ వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
హుస్సేన్‌సాగర్ చుట్టూ 33 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లు ఏర్పాటు చేశారు. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74 బేబీ పాండ్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. శోభా యాత్రకోసం మొత్తం 168 గణేశ్ యాక్షన్ టీమ్స్‌ను నియమించారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు.