కీలక నిర్ణయం.. ఆరోజు ఖైరతాబాద్‌ గణేష్ దర్శనాలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  14 Sep 2024 10:44 AM GMT
కీలక నిర్ణయం.. ఆరోజు ఖైరతాబాద్‌ గణేష్ దర్శనాలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఇప్పటికే కొన్ని చోట్ల వినాయకుడి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మంగళవారం పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు ఉండనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అయితే.. గణేష్‌ నిమజ్జనాల సందర్భంగా ఖైరతాబాద్‌ గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

నిమజ్జనానికి ముందు రోజు అంటే సోమవారం ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. అంటే మరో ఒక్క రోజు మాత్రమే మహాగణపతి దర్శనం చేసుకునేందుకు వీలుంటందన్నమాట. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. వీకెండ్ కావడం.. ఆదివారం మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో.. రేపు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరోవైపు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. కాగా.. సోమవారం వెల్డింగ్‌ తదితర పనులు జరుగుతాయనీ.. అందుకే భక్తుల దర్శనాలకు అనుమతి ఉండదని చెప్పారు నిర్వాహకులు. మంగళవారం మధ్యాహ్నానికి కల్లా ఖైరతాబాద్‌ లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.

Next Story