హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాల కలకలం
హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 11:08 AM ISTహైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాల కలకలం
హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. పదుల సంఖ్యలో టీమ్‌లుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలతో పాటు కొందరికి సంబంధించిన ఇళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆయా కంపెనీ డైరెక్టర్లు, బోర్డు మెంబర్ల ఇళ్లలోనూ దాడులు కొనసాగుతున్నాయి.
అమీర్‌పేట్, శంషాబాద్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లోని కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు నగర శివారుల్లోని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డిగూడలోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై 20 టీమ్‌లు తనిఖీలు చేస్తున్నాయి. ఈ చిట్‌ఫండ్ డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు శంషాబాద్‌లోని ఈ కామ్ కంపెనీ యజమానీ రఘువీర్, జీవన్ శక్తి చిట్‌ఫండ్ కంపెనీ యజమాని, వ్యాపారవేత్త అరికెపూడి కోటేశ్వరరావు, రైల్వే కాం్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల కోసం సీఆర్‌పీఎఫ్ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు తమిళనాడులోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. 40 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.