Hyderabad: రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 4:45 AM GMTHyderabad: రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. ప్రస్తుతం ఈ టాపిక్ నగరంలోనే కాదు.. రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. అక్రమ కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉంది హైడ్రా. తాజాగా నగరంలోని ముషీరాబాద్ నియోజవర్గం రాంనగర్‌లో చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. మణెమ్మ బస్తీలో నాలాలను ఆక్రమించి నిర్మించిన అనధికార నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. అయితే.. రాంనగర్ పరిధిలోని స్థానికుల ఫిర్యాదుల మేరకు హైడ్రా కిమిషనర్ రంగనాథ్ బుధవారమే వివిధ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. అనధికార నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత అనధికార నిర్మాణాలను కూల్చియాలంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులను రంగనాథ్ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగి.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారు.
#HYDRAA ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శుక్రవారం రాంనగర్ క్రాస్ రోడ్స్ వద్ద మణెమ్మ బస్తీలో నాలాలు (డ్రెయిన్లు) ఆక్రమించి నిర్మించిన అనధికార నిర్మాణాలను కూల్చివేశాయి. కాగా.. బుధవారం నాడు @Comm_HYDRAA ఏవీ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించి కూల్చివేతలకు ఆదేశించారు. pic.twitter.com/TrDMQDsSsh
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 30, 2024
కాగా.. హైడ్రా పరిధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నోటీసులు అన్నీ హైడ్రా ద్వారా జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. నోటీసుల జారీ, తొలగింపు చర్యలు అన్నీ ఒకే విభాగంగా ఉండాలనీ.. అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్ వరకు ఉంటుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.