సూరారంలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 5:12 PM ISTసూరారంలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
ఈ మధ్య కాలంలో విద్యార్థులు చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. పరిష్కార మార్గాలను వెతుక్కోకుండా ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సూరారంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది.
హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లాల్‌సాబ్ గూడాలో విద్యార్థిని నందిని (18) పాలిటెక్నిక్ చదువుతోంది. తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువుకుంటోంది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు ఇంటి డోర్ ఎంత కొట్టిన నందిని తెరవలేదు. దీంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందని ఇంటి కిటికీలో నుంచి చూడగా.. విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతున్న కూతురిని చూసి షాక్ అయ్యారు. గుండెలు పగిలేలా ఏడ్చారు.
దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశారు. నందిని ఎందుకు ఆత్మహత్య చేసకుంది..? ఎవరైనా వేధించారా..? మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు పోలీసులు. కాగా.. అప్పటి వరకు నవ్వుతూ తిరిగిన కూతురు తిరిగిరాని లోకలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.