అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ విద్యార్థిని మృతి

అమెరికాలోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాస్టర్స్ చదువుతున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ ప్రాణాలు కోల్పోయింది.

By అంజి  Published on  18 Oct 2023 12:45 PM IST
Hyderabad girl student, US road accident, Kansas

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ విద్యార్థిని మృతి

అమెరికాలోని కాన్సాస్‌లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిజినెస్ ఎనాలిసిస్‌లో మాస్టర్స్ చదువుతున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ ప్రాణాలు కోల్పోయింది. ప్రతీక్ష అక్క, ప్రతిభా కున్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 15వ తేదీ రాత్రి ప్రతీక్ష తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ స్టాప్‌ సిగ్నల్‌ను పాటించకపోవడంతో ఇతర వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రతిభ వివరించారు. ఈ ప్రమాదంలో సాయితేజ, ప్రియాంకలకు స్వల్ప గాయాలయ్యాయి. విషాదకరంగా, ప్రతీక్ష అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రతీక్ష పార్థివదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం లేదా సోమవారాల్లో భౌతికకాయం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. యుఎస్ వెళ్లే ముందు, ప్రతీక్ష హైందవి కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నారాయణగూడలో కుటుంబంతో కలిసి నివాసముండేది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. దురదృష్టవశాత్తు, చాలా మంది విద్యార్థులు ఇంతకు ముందు రోడ్డు ప్రమాదాలలో ఇలాంటి విషాదాలను ఎదుర్కొన్నారు.

Next Story