Hyderabad: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ.. కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు!

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగర పాలనలో వేగం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు

By -  అంజి
Published on : 11 Feb 2026 9:58 AM IST

GHMC Bifurcation News Telangana, Cyberabad Municipal Corporation, Malkajgiri Municipal Corporation , Hyderabad New Municipal Commissioners, Telangana Urban Governance Reforms

Hyderabad: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ.. కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగర పాలనలో వేగం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు భాగాలుగా విభజించింది. ఇకపై నగరంలో మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లు పని చేయనున్నాయి. విభజన వెనుక ప్రధాన ఉద్దేశం.. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పౌర సేవలను మెరుగుపరచడం, పరిపాలనను వికేంద్రీకరించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో పాత GHMCతో పాటు కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లు ఆవిర్భవించాయి.

కొత్త కమిషనర్ల నియామకం

ఈ మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది:

GHMC (జీహెచ్‌ఎంసీ): కమిషనర్‌గా ఆర్‌.వి. కర్ణన్ కొనసాగనున్నారు.

CMC (సైబరాబాద్): కొత్త కమిషనర్‌గా జి. సృజన బాధ్యతలు చేపట్టనున్నారు.

MMC (మల్కాజిగిరి): కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

వీరితో పాటు, విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి మరియు మూడు సంస్థల మధ్య సమన్వయం కోసం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారిని స్పెషల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది.

ప్రజలకు కలిగే ప్రయోజనాలు:

పాలన చిన్న విభాగాలుగా మారడం వల్ల రోడ్లు, డ్రైనేజీ, ఇతర పౌర సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది. ఐటీ హబ్ (సైబరాబాద్), శివారు ప్రాంతాల (మల్కాజిగిరి) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుంది. వికేంద్రీకరణ వల్ల నిధుల వినియోగం, పాలనలో పారదర్శకత పెరుగుతుంది.

GHMC చట్టం ప్రకారం పునర్వ్యవస్థీకరణ

జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 3(1) ప్రకారం ప్రభుత్వం నగరాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నగర జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా డివిజన్ల సంఖ్యను ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో ఉన్న 150 డివిజన్లను పునర్విభజన ద్వారా 243కి పెంచారు. వీటికి అదనంగా, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల నుండి మరో 57 డివిజన్లను చేర్చారు. దీనివల్ల మొత్తం మూడు కార్పొరేషన్ల పరిధిలో కలిపి 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి.

పాలనలో వికేంద్రీకరణ - ప్రయోజనాలు

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జోనల్ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. చిన్న విభాగాలుగా మారడం వల్ల అధికారుల జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రతి క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు వేగవంతం అవుతాయి.

ప్రస్తుతం ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలను సమన్వయం చేసే బాధ్యతను స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన జయేశ్ రంజన్ పర్యవేక్షించనున్నారు.

Next Story