Hyderabad: నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు.

By Srikanth Gundamalla  Published on  5 Sep 2023 10:33 AM GMT
Hyderabad, Flood, boy lost, nala,

Hyderabad: నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌ గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. కాలనీల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల అయితే.. నీళ్లు త్వరగా వెళ్లేందుకు మ్యాన్‌హోళ్లను తెరిచి పెడుతుంటారు. ఇలా మ్యాన్‌హోళ్లను తెరిచి ఉంచడం ద్వారాగతంలో చాలా మంది ఆపాయంలో పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు గాయాలపాలయ్యారు. అయితే.. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహానగరంలో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉంటాయనే అధికారులు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నాలుగేళ్ల బాలుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయాడు.

ఇటీవల ముషీరాబాద్‌ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు. ప్రగతి నగర్‌లోని సాయి నగర్‌ కల్వర్టు వద్ద ఉన్న నాలా పక్కనే నితిన్‌ అనే బాలుడు ఆడుకుంటన్నాడు. అయితే.. ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా పడటంతో..కాలనీ మొత్తం వరద మయం అయ్యింది. నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు నాలాను తెరిచి ఉంచారు. అయితే.. అది గమనించని బాలుడు అటుగా నడుస్తూ వచ్చాడు. అర క్షణంలోనే బాలుడు నీటిలో మునిగిపోయాడు. ఇదంతా అక్కడే ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

అయితే బాలుడు నాలాలో పడిపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు రాజీవ్ స్వగృహ వద్ద బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి డెడ్‌బాడీని వెలికి తీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి అనుకోని విధంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story