ECIL కంపెనీ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల, ఆందోళనలో ఉద్యోగులు
ఈసీఐఎల్‌లో ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని భోజనశాలలో పప్పులో పాము పిల్ల కనిపించింది.
By Srikanth Gundamalla
ECIL కంపెనీ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల, ఆందోళనలో ఉద్యోగులు
హైదరాబాద్: ఈసీఐఎల్‌లో ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని భోజనశాలలో పప్పులో పాము పిల్ల కనిపించింది. జూలై 21న ఈ సంఘటన చోటుచేసుకుంది. భోజనం సమయంలో ఇలా పప్పులో చనిపోయిన పాము పిల్ల రావడంతో ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్లోని పప్పులో పాము రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుంచి పాము పిల్ల బయటపడింది. దాంతో.. ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారంటూ నిలదీశారు. అయితే.. అప్పటికే భోజనం చేసిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ద్యోగ సంఘాల నాయకులతో, స్థానిక పోలీసులతో ప్రస్తావించగా .. తమ దృష్టికి రాలేదని చెప్పారు. క్యాంటీన్ గుత్తేదారుని విచారిస్తున్నామని.. ఓ అధికారి తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాత్రి షిఫ్టులో ఉన్న ఉద్యోగులు ధర్నా చేశారు.
గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయి. ఎలకలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు ఆహార పదార్థాలలో వస్తాయని నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా కొన్ని వేల మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారులు ఉద్యోగులు ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యాలను పట్టించుకోవాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటనతో ఇప్పటికైనా మేల్కొని జాగ్రత్తగా వ్యవహించాలని కోరుతున్నారు. ఇక కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.