'పుష్ప' తరహాలో గంజాయి స్మగ్లింగ్.. చేతులు కలిపిన కానిస్టేబుల్
మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 11:25 AM GMT'పుష్ప' తరహాలో గంజాయి స్మగ్లింగ్.. చేతులు కలిపిన కానిస్టేబుల్
మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలపై పుష్ప సినిమా ప్రభావం చాలా పడింది. వారు అక్రమంగా రవాణా చేసే మాదకద్రవ్యాలను పోలీసుల చేతికి చిక్కకుండా పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త పద్ధతిలో తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవతున్నారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు రెండు కేసులలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్టు చేశారు. అయితే ఒక ముఠాలో కానిస్టేబుల్ హస్తం ఉండడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుండి నార్కోటిక్ పోలీసులు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒరిస్సా మల్కానిగిరి నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేసేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్లుగా నార్కోటిక్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. దాంతో వెంటనే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాటు వేసి ఉన్నారు. అయితే లగ్జరీ కార్లలో కనిపంచకుండా గంజాయిని దాచిపెట్టి.... పైగా పోలీసు సైరన్ వేసుకొని చెక్ పోస్ట్ అన్ని దాటేస్తూ వస్తున్న స్మగ్లర్లను నార్కోటిక్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు లగ్జరీ కారును ఆపి అందులో తనిఖీ చేయగా భారీ ఎత్తున గంజాయి కనిపించింది. అయితే స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో పోలీసుల చేతికి చిక్కకుండా గంజాయిని కారులో ప్రత్యేకమైన ఏర్పాటుచేసి అందులో దాచిపెట్టిన తీరని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
గంజాయిని తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడించారు. అయితే గంజాయి సరఫరా చేసే ముఠాలో ఒక కానిస్టేబుల్‌ని చూసి పోలీసులు షాక్ గురయ్యారు. మామునూరు బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తేజ ప్రశాంత్ నాయక్ తో పాటు ఐదుగురిని అరెస్టు చేశామన్నారు సీపీ. కానిస్టేబుల్ ప్రశాంత్ మహబూబాబాద్ కు చెందిన వీరన్నతో కలిసి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పారు. ఈ గంజాయి సరఫరా చేస్తున్న దానిలో ముగ్గురు వ్యాపారవేత్తలు ఉన్నారనీ.. అయితే ఈ ముఠా ప్రతినెల క్వింటాల్ గంజాయిని ఒరిస్సా నుండి మహారాష్ట్రకు వివిధ పద్ధతుల్లో పోలీసుల కంటపడకుండా తరలిస్తున్నారని సీపీ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం వీరివద్ద నుంచి కోటి రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరోచోట డ్రగ్స్ విక్రయిస్తూ ఒక నైజీరియన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నైజీరియన్ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెంగళూరులో కేంద్రంగా చేసుకొని దక్షిణ భారత్ మొత్తానికి డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు డివినన్ నకిలీ వీసా పాస్‌పోర్ట్ తో ఇండియాకు వచ్చి గుట్టుచప్పుడు ఉంటున్నాడని చెప్పారు పోలీసులు. నిందితుడి నుంచి 11 లక్షల రూపాయలు విలువచేసే ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు.