Hyderabad: కలుషిత నీరు వస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో తాగునీటిసరఫరాపై మరింత దృష్టి పెట్టింది జలమండలి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 7:23 AM ISTహైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో తాగునీటిసరఫరాపై మరింత దృష్టి పెట్టింది జలమండలి. తాగునీటిని నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కలుషిత నీరు ముప్పు ఉన్న నేపథ్యంలో.. తాగునీటిలో తగిన మోతాడులో క్లోరిన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. నీటి ద్వారానే ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ.. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే క్లోరిన్ బిల్లలను వినియోగించి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
మంగళవారం జలమండలి ఎండీ పలువురు అధికారులతో కలిసి నగరంలో పలు చోట్ల పర్యటించారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షించిన తర్వాతే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. క్లోరిన్ సైతం తగిన మోతాదులో ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. మ్యాన్‌హోల్స్ ఉప్పొంగితే వెంటనే పూడిక తీయించాలని, వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.మంచి నీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జాగ్రత్త వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఇక తాగునీటి సరఫరా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు అశోక్‌రెడ్డి. ప్రజలు కూడా ఇళ్లలో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోడానికి క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు 8.80 లక్షల క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేశామన్నారు. కలుషిత నీరు సరఫరా అయినా.. లేదంటే తాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే జలమండలి కస్టమర్ కేర్ 155313 నెంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు అశోక్ రెడ్డి సూచించారు.