రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులు
మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లను అధికారులు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 7:15 PM ISTమెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లను అధికారులు చేస్తున్నారు. డీపీఆర్‌లు తుది దశకు చేరుకున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డితో చెప్పారు ఎన్వీఎస్ రెడ్డి.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో... కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు తీయనుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు విస్తరించనున్నట్లు వివరించారు. ఇక రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు పరుగులు తీయనుంది.
రెండో దశలో ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరాంఘర్-బెంగళూరు రహదారిపై కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు. కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. అంతేకాదు.. ఎయిర్ పోర్టు కారిడార్ లో ఒకటిన్నర కిలోమీటరు దూరం భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణించనుంది. ఫోర్త్ సిటీకి రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలును తీసుకురానున్నారు. ఇతర భారతీయ నగరాల్లోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు.