Hyderabad: ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు
బహదూర్‌పురాలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla
Hyderabad: ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్‌పురాలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉండగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. భవనం పక్కకు ఒరగడంతో స్థానికులంతా భయపడిపోయారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. పక్కపక్కనే భవనాలు కూడా ఉన్నాయి. దాంతో.. అందుల్లో ఉన్న వారిని నిన్ననే జీహెచ్‌ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. అయితే.. భవనం ఎలాగైనా కూలుతుందని భావించిన అధికారులు నాలుగంతస్తుల భవనాన్ని కూల్చేయాలని అనుకున్నారు. దాంతో.. ఆ మేరకు చర్యలు చేపట్టారు.
బహదూర్‌పురాలో రెండస్తుల భవనం కోసం అధికారుల నుంచి అనుమతి తీసుకుని.. అక్రమంగా నాలుగంతస్తులు నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. యజమానిపై కేసు కూడా నమోదు చేశారు. భవనం వల్ల చుట్టుపక్కల వారికి డేంజర్ అని భావించిన అధికారులు..కూల్చివేత పనులు ప్రారంభించారు. భవనాన్ని కూల్చివేసే బాద్యత ఏజెన్సీకి అప్పగించారు. ఇక కూల్చివేత పనుల ఖర్చుని ఓనర్ భరించేలా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించారు. గతంలో డెక్కన్ మాల్‌ని కూల్చేసిన అనుభవం ఉన్న మాలిక్ ట్రేడింగ్ కంపెనీకి ఆ బాద్యతలు అప్పజెప్పారు. మొత్తం 27 లక్షలకు కూల్చేసేందుకు ఇంటి యజమానితో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. కాగా.. ఇప్పటికే రూ.7లక్షలు ఏజెన్సీకి భవనం ఓనర్ చెల్లించినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అదికారులు దగ్గరుండి కూల్చివేత పనులను పరిశీలిస్తున్నారు.