చట్టానికి లోబడే హైడ్రా అధికారులు పనిచేస్తున్నారు: దాన కిశోర్
మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ మీడియా సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 28 Sep 2024 12:09 PM GMTహైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులతో కలిసి మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ మీడియా సమావేశం నిర్వహించారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని దానకిశోర్ అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరినీ బలవంతంగా పంపించడం లేదని అన్నారు. వారికి నచ్చజెప్పి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
మూసీకి వరద వస్తే ఇబ్బంది పడేది ప్రజలేనని దాన కిశోర్ అన్నారు. 1927లో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందని గుర్తు చేశారు. అయితే.. మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని అన్నారు. అలాగే.. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ చెప్పారు. మూసీకి వచ్చే మురికిని క్లీన్ చేసేందుకు రూ.3,800 కోట్లు కేటాయించామని, మూసీ నిర్వాసితులకు ఉపాధితో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని దాన కిశోర్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి అధికారులు వెళుతున్నారని, ప్రతీ విషయం వివరిస్తున్నారని చెప్పారు. చట్టానికి లోబడే హైడ్రా అధికారులు పనిచేస్తున్నారు అని దాన కిశోర్ చెప్పారు. ఆక్రమణలకు గురైన మూసీని విస్తరింపజేస్తామని అన్నారు.
55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ పేర్కొన్నారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని తెలిపారు. మొన్నటి వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని దానకిశోర్ కోరారు.