కన్నవారే ప్రత్యక్ష దైవాలని, వారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 'తల్లిదండ్రుల మద్దతు బిల్లు' పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మానవీయ విలువలు సన్నగిల్లుతున్న నేటి కాలంలో, కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు గుండెను కలేచివేస్తున్నాయని, ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక విప్లవాత్మక మార్పు అని ఆయన కొనియాడారు.
జీతాల నుంచి కట్.. తల్లిదండ్రులకు నేరుగా భరోసా
వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని కట్ చేసి, నేరుగా తల్లిదండ్రులకు అందజేసేలా చట్టం తీసుకురావడం గొప్ప పరిణామమని సజ్జనార్ అన్నారు. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు ఒక హెచ్చరిక అని, అదే సమయంలో అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు కేవలం రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కన్నవారి ఆశీస్సులే శ్రీరామరక్ష
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోరుకునేది విలాసవంతమైన జీవితం కాదని, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమేనని సీపీ గుర్తుచేశారు. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. "తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష" అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.