Hyderabad: డీజేలపై నియంత్రణ అవసరం: సీపీ ఆనంద్

ఏ ఈవెంట్‌ అయినా సరే డీజేలు కంపల్సరీ అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2024 11:45 AM GMT
Hyderabad: డీజేలపై నియంత్రణ అవసరం: సీపీ ఆనంద్

ఏ ఈవెంట్‌ అయినా సరే డీజేలు కంపల్సరీ అయ్యాయి. పెద్ద పెద్ద సౌండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. వీటి వల్ల స్థానికంగా ఉండే జనాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా డీజేల నియంత్రణపై హైదరాబాద్ పోలీసులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వినియోగంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

డీజే సౌండ్స్‌పై సాధారణ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వీటి వల్ల నివాసాల్లో ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అంతేకాదు.. కొందరు గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయన్నారు. కేవలం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే కాకుండా మిలాద్ ఉన్ నబి వేడుకల్లోనూ డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. డీజే శబ్దాలను కట్టడి చేయాలని వివిధ సంఘాల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. డీజే శబ్దాలపై నియంత్రణ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అందుకే తాము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామనీ.. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

పెద్ద సౌండ్స్‌ డీజేలపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీజేలు పెట్టడానికి సమయాలను నిర్దేశించడంతో పాటు, సౌండ్ పర్సంటేజీపై ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎలాంటి సందర్భాల్లో డీజేలు ఉపయోగించకూడదనే.. వినియోగించొద్దు అనే దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story