Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం
హైదరాబాద్‌లోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 12:50 PM ISTHyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం
హైదరాబాద్‌లోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. చుట్టూ ఇతర భవనాల్లో జనాలు నివాసం ఉంటున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కకు ఒరగడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణం కూలిపోతుందో అన్న భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఈ సంఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు.
నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు వచ్చాయని.. అందుకే పక్కకు ఒరిగిందని అధికారులు చెబుతున్నారు. పక్క భవనంలో నివాసంలో ఉంటున్న పలువురిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ క్షణమైనా భవనం కూలే ప్రమాదం ఉందని.. అటుగా ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భవనాన్ని అధికారులే కూల్చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో అధికారులు సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం అందుతోంది. ఇవాళే ప్రమాదకరంగా పక్కకు ఒరిగిన ఈ భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యజమాని రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్న భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా భవనం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎవరూ తిరగకుండా చూస్తున్నారు. భవనాన్ని కూల్చేసేవరకు లోనికి ఎవరినీ అనుమతించడం లేదు. గతంలోనూ ఇదే తరహాలో నగరంలోని చింతల్ ప్రాంతంలో ఓ భవనం కూలిన సంఘటన చోటుచేసుకుంది. చింతల్‌లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్‌లతో జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే.. నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. అనుమతులు లేకుండా, నాణ్యత లేని నిర్మాణాలను చేపడితే చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా.. బహదూర్‌పురాలో ప్రస్తుతం పక్కకు ఒరిగిన బిల్డింగ్‌ను కూల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.