హైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 27 July 2024 8:42 AM IST
హైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది. సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ కొనసాగనుంది. ఈ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహుదుర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నెల 28 ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్ వరకు కొనసాగే భారీ ర్యాలీలో ఏనుగుపై ఉరేగింపు ఉంటుందన్నారు. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామనీ.. కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని చెప్పారు. ఇక ట్రాఫిక్ పోలీసులకు నగర వాసులు, వాహన దారులు సహకరించాలని ఆయన కోరారు.
సింహ వాహిని మహంకాళి లాల్‌దర్వాజ బోనాలు అట్టహాసంగా జరుగుతాయి. ఎంతో మంది భక్తులు వస్తుంటారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా వంద ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. లాల్ దర్వాజ ఆలయం, ఎంజీబీఎస్, రేతిఫైల్, JBS లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక మిగతా సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లను సంప్రదించాలని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు.