రేపే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర.. తెల్లవారుజామునే తొలి బోనం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు.
By Srikanth Gundamalla Published on 8 July 2023 5:57 AM GMTHyderabad Bonalu Secunderabad Ujjaini jatara
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాఢ మాస బోనాల జాతర ఇప్పటికే మొదలైంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు సిద్ధం చేశారు. బోనాల సీజన్‌లో ప్రతి ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది. గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ బోనాలతో పల్లె, పట్నం అని తేడా లేకుండా ప్రతి చోటా బోనాల జాతర జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాల మధ్య భక్తులు, జనాలు బోనాల సందడిలో మునిగిపోతున్నారు. ఆషాఢం నుంచి శ్రావమాస వరకు బోనాల జాతర కొనసాగుతుంది. బోనాల సంబరాల సందర్భంగా గ్రామాల్లో పచ్చని మామిడి తోరణాలు, రంగులు, సున్నాలతో ఇంటి పరిసరాలు, బంధువులతో కళకళలాడుతున్నాయి.
జూన్ 22వ మొదలైన ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జూలై 20వ తేదీ వరకు జరగనున్నాయి. జూన్ 22న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిబోనం సమర్పించారు. ఇక రేపు అంటే జూలై 9వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బోనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వమే బోనాల జాతరను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈసారి బోనాల కోసం రూ.15 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశ విదేశాలకు తెలిపేలా ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. మన తెలంగాణలోనే కాదు.. ఇతర దేశాల్లో ఉన్నా కూడా మనవాళ్లు బోనాల సంబరాలు జరుపుకొంటున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తొలిబోనం ఉదయమే సమర్పించినా అప్పటికే భక్తులు ఆలయానికి భారీగా తరలి వస్తారు కాబట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు కిందకు వేళాడుతున్నట్టు భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ట్రాన్స్‌కో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. దేవాలయ పరిసరాల్లో ఎక్కడా మురుగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అదేవిధంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు అడుగడుగునా మంచినీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జాతర కారణంగా దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని మంత్రి తలసాని చెప్పారు.
జూలై 9, 10 రెండ్రోజుల పాటు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఆ తర్వాత జూలై 10న రంగం కార్యక్రమం ఉంటుంది. జూలై 16న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు జరగనున్నాయి. చిలకలగూడలోని పోచమ్మ, కట్ట మైసమ్మ ఆలయానికి కూడా బోనాలు తీసుకెళ్తారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, షా అలీ బండలోని ముత్యాలమ్మ ఆలయంలో కూడా బోనాలు వేడుకలు జరుగుతాయి. ఇక చివరగా జూలై 20న చివరి బోనంతో హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి
బోనాల సందర్భంగా రాజకీయ నాయకులు కూడా తమ పలుకుబడిని చూపించేందుకు, ప్రచారాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి బోనాలకు వచ్చే భక్తులకు స్వాగతాలు పలుకుతారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల పాటు సాగే ఉజ్జయిని మహంకాళి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా తమకు కుదిరిన చోట్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బోనాల సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.